- జీవో 29ని రద్దు చేయాలి
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరిన బీసీ మేధావులు
- ఈ జీవో బీసీలకు ఉరితాడుగా మారింది
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కూడా బీసీలకు తీరని అన్యాయం
- ఎంఎస్‌ఎంఈ పాలసీలో వారికి రిజర్వేషన్లు కల్పించాలని వినతి
హైదరాబాద్, వెలుగు: జీవో 29 ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం కలుగుతుందని బీసీ మేధావులు అన్నారు. ఈ జీవోను రద్దు చేసి మరో జీవో తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, కుందారం గణేశ్ చారి, బాలగోని బాలరాజు గౌడ్ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను రాజ్‌భవన్‌లో కలిసి బీసీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం రాజ్ భవన్ బయట వారు మీడియాతో మాట్లాడారు. జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇటీవల గ్రూప్1 ఉద్యోగాల నియామకాల కోసం జారీ చేసిన జీవో 29 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉందని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తక్కువ మార్కులు వచ్చినోళ్లకు ఉద్యోగాలెలా ఇస్తారు?
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జీవో నంబర్ 29 బీసీ వర్గాలకు ఉరితాడుగా మారిందని బీసీ మేధావులు పేర్కొన్నారు. ఎక్కువ మార్కులు వచ్చిన బీసీలకు ఉద్యోగాలు రావడం లేదని, అతి తక్కువ మార్కులొచ్చిన అగ్ర వర్ణాలకు ఉద్యోగాలు వస్తుండటం చాలా బాధాకరమన్నారు. మొన్న జరిగిన డీఎస్సీ ఫలితాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కంటే కటాఫ్ మార్కులు తక్కువ వచ్చినోళ్లకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు గ్రూప్1 విషయంలో గతంలో ఉన్న 55 జీవోను సవరించి 29ని తీసుకురావడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఓపెన్‌లో వచ్చిన రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కింద లెక్కిస్తూ గ్రూపు1 ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రూప్1లో అగ్రకుల అభ్యర్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే భవిష్యత్‌లో వారికే ఐఏఎస్ ఉద్యోగాలు దక్కుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 రద్దయ్యే చాన్స్: తీన్మార్ మల్లన్న
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్ర వర్ణాలకు జరుగుతున్న న్యాయాన్ని గవర్నర్‌కు వివరించామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గతంలో ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తాను తీసుకెళ్లగా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మరోసారి విన్నవించామన్నారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. జీవో 29 ద్వారా జరిగిన గ్రూప్ 1 రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ జీవోతో పరీక్ష రాస్తున్న విద్యార్థుల మనోధైర్యం దెబ్బ తింటుందని, ఇంకా ఎన్నిసార్లు పరీక్షలు రాయాలని విద్యార్థులు అంటున్నా రని మండిపడ్డారు. కోర్టులో తుది తీర్పు వచ్చాకే పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరామన్నారు. సీఎంకు 3 సార్లు వినతిపత్రం అందజేశానని వెల్లడించారు.